-->

Thursday, 17 December 2015

లోఫర్: లోఫ‌ర్ అంటూ టైటిల్ తేడాగా ఉన్నా క‌థ మాత్రం మ‌ద‌ర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుం


Rating :
ఈ మ‌ధ్య పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌న్నీ మాఫియాలు, గ్యాంగ్ ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక‌ప్పుడు సెంటిమెంట్ సినిమాలు కూడా చేసాడు పూరీ. మ‌ళ్లీ చాలా కాలం త‌ర్వాత ఇప్పుడు మ‌ద‌ర్ సెంటిమెంట్ సినిమా చేసాడు పూరీ. లోఫ‌ర్ అంటూ టైటిల్ తేడాగా ఉన్నా క‌థ మాత్రం మ‌ద‌ర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంద‌న్నాడు పూరీ.. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది..?
క‌థ‌:
చిన్న‌పుడే అమ్మ‌ నుంచి బిడ్డ‌ను వేరు చేస్తాడు పోసాని. పుట్టింటి నుంచి ఆస్తి తీసుకురాన‌ని చెప్ప‌డంతో.. కొడుకుతో పాటు పారిపోతాడు పోసాని. త‌న కొడుకు రాజా(వ‌రుణ్ తేజ్) ను త‌న‌కంటే పెద్ద లోఫర్ ని చేస్తాడు. అమ్మ చ‌నిపోయింద‌ని చెబుతాడు. జోధ్ పూర్ లోనే మోసాలు, దొంగ‌తనాలు చేసుకుంటూ పోతాడు రాజా. ఇలా సాగిపోతున్న స‌మ‌యంలోనే ఇంటి నుంచి పారిపోయి వ‌చ్చిన మౌని(దిశాప‌టానీ) ని చూసి ప్రేమిస్తాడు రాజా. ఆమె వ‌ల్లే త‌న‌ అమ్మ(రేవ‌తి) బ‌తికే ఉంద‌ని తెలుసుకుంటాడు రాజా. అక్క‌డ్నుంచి అమ్మ వ‌ద్ద‌కి వెళ్లిపోతాడు. మ‌రి అమ్మ‌ని రాజా క‌లుసుకున్నాడా..? ఈ క్ర‌మంలో విల‌న్ గ్యాంగ్ నుంచి రాజాకు ఎదురైన క‌ష్టాలేంట‌నేది మిగిలిన క‌థ‌..
క‌థ‌నం:
లోఫ‌ర్ క‌థ చాలా సింపుల్. త‌ల్లికి దూరమైన ఓ కొడుకు.. ఆమె చెంత‌కు ఎలా చేరాడ‌నేది లోఫ‌ర్ క‌థ‌. అమ్మా నాన్నా ఓ త‌మిళ అమ్మాయిలో త‌ల్లితో ఉంటాడు కొడుకు.. ఇక్క‌డేమో తండ్రితో లోఫ‌ర్ గా పెరుగుతాడు. అక్క‌డ తండ్రిని సెకండాఫ్ లో క‌లుసుకుంటాడు.. ఇక్క‌డ త‌ల్లిని చూస్తాడు. అయితే అమ్మా నాన్నా ఓ త‌మిళ అమ్మాయిలో తండ్రి చాలా మంచోడు.. ఇక్క‌డ లోఫ‌ర్. చూడ్డానికి ఒకే క‌థలా ఉందేమో అనుకున్నా.. ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. అస‌లు అమ్మా నాన్నా ఓ త‌మిళ అమ్మాయిలో ప్ర‌తీ సీన్ ను అద్భుతంగా తెర‌కెక్కించాడు పూరీ. సెంటిమెంట్ సూప‌ర్బ్. కానీ లోఫ‌ర్ లో అది క‌నిపించ‌దు.
వ‌రుణ్ తేజ్, పోసాని మోసాలు, దొంగ‌త‌నాలతోనే ఫ‌స్టాఫ్ మొత్తం పూర్తైపోతుంది. మ‌ధ్య‌లో హీరోయిన్ గ్లామ‌ర్ షో.. ఆమె చిన్న రొటీన్ ఇష్టం లేని పెళ్లి ఫ్లాష్ బ్యాక్.. అంత‌లోనే చ‌నిపోయింద‌నుకున్న అమ్మ క‌నిపించ‌డం.. ఇవ‌న్నీ సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తాయి. పంచ్ డైలాగుల‌తో కామెడీని పుట్టించే పూరీ.. ఈ సినిమాలో అది కూడా చేయ‌లేక‌పోయాడు. క‌థ‌లో ఎక్క‌డా వేగం క‌నిపించ‌దు. రేవ‌తి ఎంట్రీతో సెకండాఫ్ లోనైనా క‌థ ప‌రిగెడుతుంద‌నుకుంటే.. అక్క‌డా అదే పాల‌సీ. సెకండాఫ్ లో కొడుకు పుట్టిన‌రోజు సీన్ లో రేవతి సీన్ మిన‌హాయిస్తే.. సినిమాలో ఒక్క‌టంటే ఒక్క బ‌లమైన సెంటిమెంట్ సీన్ లేదంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. వంద‌ల మంది కాపలా ఉండే విల‌న్ ఇంట్లోకి హీరో ద‌ర్జాగా వ‌స్తాడు.. వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.. మ‌న తెలుగు హీరోలింతే అని స‌రిపెట్టుకుందాం అనుకున్నా.. లాజిక్ క‌నెక్ట్ అవ్వ‌దు. చివ‌రికి పూరీ కూడా శ్రీ‌మంతుడు స్పూఫ్ న‌మ్ముకోవాల్సి వ‌చ్చింది. బ్ర‌హ్మానందం చేసిన ఆ కామెడీ కూడా న‌వ్వించ‌లేదు.
న‌టీన‌టులు:
మాస్ ఇమేజ్ వ‌ద్దంటూనే ఫుల్ మాస్ గా క‌నిపించాడు వ‌రుణ్ తేజ్. తొలి రెండు సినిమాల్లో చాలా సైలెంట్ కుర్రాడిగా క‌నిపించిన వ‌రుణ్.. ఇక్క‌డ మాస్ హీరోగా రెచ్చిపోయాడు. ఎక్స్ ప్రెష‌న్స్ లో మాత్రం కాస్త మెరుగుప‌డాలేమో అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ లో రేవ‌తి అనుభవం ముందు తేలిపోయాడు వ‌రుణ్. దిశాప‌టానీ పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌యింది. అమ్మ పాత్ర‌లో రేవ‌తి అద‌ర‌గొట్టింది. పోసాని న‌వ్వించాడు. తండ్రి పాత్ర‌లో ఓకే అనిపించాడు. మిగిలిన వాళ్ల‌లో ఎవ్వ‌రికీ పెద్ద‌గా చెప్పుకోదగ్గ పాత్ర‌ల్లేవు. ఇలా వ‌చ్చి అలా వెళ్లే పాత్ర‌లే. బ్ర‌హ్మానందం శ్రీ‌మంతుడు స్పూఫ్ న‌వ్వించ‌లేక‌పోయింది.
టెక్నిక‌ల్ టీం:
పూరీతో చ‌క్రి, మణిశ‌ర్మ లాంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్లు బాగా ట్యూన్ అయ్యారు. కానీ త‌ర్వాత ఎవ్వ‌రూ సెట్ కాలేదు. ఇప్పుడు సునీల్ క‌శ్య‌ప్ కూడా ఓకే అనిపించాడంతే. సువ్వీ సువ్వాలమ్మా, జియా జ‌లే పాట‌లు బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. సి క‌ళ్యాణ్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ సోసోగా ఉన్నాయి. లో బ‌డ్జెట్ లో ప‌ని కానిచ్చాడు. ఇక ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడిగా మారాడు పూరీ. డైలాగ్ రైటర్ గా అక్క‌డ‌క్క‌డా పూరీ పెన్ ప‌వ‌ర్ క‌నిపించింది. కానీ టెంప‌ర్ స్థాయిలో డైలాగులు ఇక్క‌డ లేవు. ఓవ‌రాల్ గా యావ‌రేజ్ ఫ‌స్టాఫ్.. రొటీన్ సెకండాఫ్.. ద‌ర్శ‌కుడిగా పూరీ యావ‌రేజ్.
చివ‌ర‌గా:
పూరీ జ‌గ‌న్నాథ్ బ్రాండ్ వ్యాల్యూ.. వ‌రుణ్ తేజ్ మాస్ అప్పియ‌రెన్స్.. దిశా ప‌టాని అందాలు.. ఈ వీకెండ్ వ‌ర‌కు ప‌నికొస్తాయేమో గానీ.. సినిమా నిల‌బ‌డేంత స‌రుకు మాత్రం లోఫ‌ర్ లో లేదు.
న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, దిశాప‌టానీ, రేవ‌తి, పోసాని, అలీ త‌దిత‌రులు..
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: పూరీ జ‌గ‌న్నాథ్
నిర్మాత‌: సి. క‌ళ్యాణ్.
NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
 

Delivered by FeedBurner